Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మన రాష్ట్రం మన పాలన

-మన కేసీఆర్ పట్టాభిషేకం నేడే -అర్ధరాత్రి సూర్యోదయం -ఇది తెలంగాణకు నవోదయం!

అరవై ఏళ్ల చీకట్లను చీల్చుకొని దూసుకొచ్చిన స్వేచ్ఛాకిరణం! వేయి మందికిపైగా అమరవీరుల స్ఫూర్తి జ్వలిస్తుంటే.. నాలుగు కోట్ల మంది ప్రజలు నిశీధి వీధుల్లో కాంతిరేఖలను అనుభూతించిన అపూర్వ సందర్భం! సంబురం.. సంరంభం..! ఉల్లాసం.. ఉత్సాహం.. పట్టపగ్గాలేని ఆనందం! తెలంగాణ గజ్జె పది జిల్లాల్లోనూ ఘల్లుమన్నది! స్వేచ్ఛను ప్రకటించింది తెలంగాణ డప్పు! జాతిని జాగతపరిచిన గీతాల జనజాతర! గుండెలు నిండిన ఆత్మగౌరవం! పోరాడితే పోయిందేమీ లేదు..

Telanana-Stateవలసపాలన సంకెళ్లు తప్ప! అవును.. మన స్వప్నం నిజమైంది! కొన్ని రుధిర ధారలు.. మరికొన్ని అగ్నిజ్వాలలు పునీతం చేసిన గడ్డ ఇది! లక్షల మంది త్యాగాల పునాదులపై ఆవిష్కతమైన జనసౌధమిది! ఇప్పుడిది విముక్త తెలంగాణ మాగాణం! జూన్ రెండు తొలి ఘడియ.. భారతదేశ చిత్రపటంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం! ఇప్పుడిక మన రాష్ట్రంలో మనం! ఈ అపురూప సందర్భాన్ని పది జిల్లాలు ప్రణమిల్లి స్వాగతించాయి! ఊరూవాడా.. పల్లె పట్నం తన్మయత్వంతో ఊగిపోయాయి! జై తెలంగాణ నినాదాలు.. పటాకుల మెరుపులతో తెలంగాణ ప్రగతిబాట జాజ్వల్యమైంది! ప్రజలు పట్టం గట్టిన మన ఇంటిపార్టీ అధినేత కేసీఆర్.. ఆ వెలుగుల్లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా నేటి ఉదయం 8.15 గంటలకు ప్రమాణం స్వీకరించగానే ఇక తెలంగాణకు శాసించే దశ!

నేటినుంచే నవశకం – కేసీఆర్‌తోపాటు 10 మంది మంత్రులుగా ప్రమాణం.. -పరేడ్ గ్రౌండ్స్‌లో ఆవిర్భావ వేడుకలు -గులాబీమయమైన రాజధాని హైదరాబాద్.. -హోరెత్తిన హుస్సేన్‌సాగర్ -అర్ధరాత్రినుంచే టీఆర్‌ఎస్ ఆధ్యర్యంలో సంబురాలు.. -జిల్లాల్లోనూ భారీ వేడుకలు

సీమాంధ్ర పాలకులపై తెలంగాణ ప్రజలు జరిపిన ఆరు దశాబ్దాల పోరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్రం సాకారమవుతున్నది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ సోమవారం ఆవిర్భవిస్తున్నది. రాష్ట్రపతిపాలనను ఎత్తివేస్తూ సోమవారం ఉదయమే కేంద్రం ఒక నోటిఫికేషన్ జారీచేయడంతో తెలంగాణ రాష్ట్రం ఉనికిలోకి వస్తుంది. నూతన రాష్ర్టానికి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్‌సేన్ గుప్తా రాజ్‌భవన్‌లో ఉదయం 6.30 గంటలకు ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత రాజ్‌భవన్‌లో ఉదయం 8.15 గంటలకు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు.

celebrationఅంతకు ముందే ఉదయం 7.30 గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులు అర్పించి రాజ్‌భవన్ చేరుకుంటారు. ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం పది మంది రాష్ట్ర మంత్రులుగా కూడా ప్రమాణం చేస్తారు. వీరితో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయిస్తారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌ను సర్వాంగసుందరంగా అలంకరించారు. ప్రమాణ స్వీకారోత్సవానికి పరిమిత సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించారు. పోలీసులు ఇప్పటికే ఈ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేశారు.

రాజ్‌భవన్ పరిసరాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీగా కేసీఆర్ కటౌట్లు, గులాబీ జెండాలు ఏర్పాటు చేశారు. రాజ్‌భవన్‌లో ప్రమాణం అనంతరం కేసీఆర్ నేరుగా తెలంగాణ భవన్‌కు వెళతారు. అక్కడ తెలంగాణ తల్లి, జయశంకర్, అంబేద్కర్ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఉదయం 10.10 గంటలకు తెలంగాణ రాష్ర్టావతరణ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నూతన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయజెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.57 గంటలకు సచివాలయంలో సీ-బ్లాక్‌లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా సచివాలయం ఆవరణలోని నల్లపోచమ్మ ఆలయంలో ఆయన పూజలు నిర్వహిస్తారు. పదవీ స్వీకారం అనంతరం ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చుతూ కొన్ని కీలక ఫైళ్లపై ఆయన సంతకం చేయనున్నారు.

విస్తత ఏర్పాట్లు..: కాగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, నూతన ప్రభుత్వ పదవీ స్వీకార కార్యక్రమాలకు ప్రభుత్వం విస్తత ఏర్పాట్లు చేసింది. రాజ్‌భవన్,పరేడ్ గ్రౌండ్‌లను సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికారులు కనివిని ఎరుగని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఆదివారం నమూనా పరేడ్ నిర్వహించారు.

అవతరణ దినోత్సవాల్లో భాగంగా తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా అనేక సాంస్కతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్ శ్రేణులు రాజ్‌భవన్, పరేడ్ మైదానం నలువైపులా గులాబీ జెండాలతో నింపేశారు. కేసీఆర్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. నూతన రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. కేసీఆర్ వెళ్లే అన్ని మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధం చేస్తున్నారు. ఇప్పటికే వాహనాలతో రిహార్సల్ కూడా నిర్వహించారు. ముఖ్య ఉత్సవాలు నిర్వహించే పరేడ్ గ్రౌండ్స్ చుట్టుపక్కల వివిధ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే మీడియా ద్వారా ప్రకటించారు. ఈ ఉత్సవాలకు వివిధ జిల్లాలనుంచి భారీగా ప్రజలు హాజరుకానుండడంతో నగరంలో ప్రవేశించే వాహనాలకు వివిధ ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఇక సచివాలయంలో నూతన ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ అధికారులు, తెలంగాణ ఉద్యోగులు భారీ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ మిగిలిన 9 జిల్లాల్లో ఆవిర్భావ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేశారు.

గులాబీమయంగా నగరం…: నూతన రాష్ట్ర ఆవిర్భావం, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమాలు కలిసి రావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేస్తున్నారు. నగరంలోని అన్ని మార్గాలను పూర్తిగా గులాబీమయం చేశారు. రహదార్ల పోడవునా గులాబీ తోరణాలు వేలాడదీశారు. అన్ని కూడళ్లలో భారీగా ప్లెక్సీలు కటౌట్లు ఏర్పాటు చేశారు.

నగరంలో ప్రధాన మార్గాల్లో భారీ హోర్డింగులు అమర్చారు. ఎటుచూసినా గులాబీ జెండాల రెపరెపలే కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గన్‌పార్క్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌లను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఆదివారం అర్దరాత్రినుంచే తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్, ట్యాంక్‌బండ్, పీపుల్స్ ప్లాజాలు ఈ వేడుకలకు వేదికలయ్యాయి. ఆటపాటలు, సాంస్కతిక కార్యక్రమాలతో హుస్సేన్ సాగర్ హోరెత్తిపోయింది.

తెలంగాణకు 44మంది ఐఏఎస్‌లు.. : తెలంగాణలో పరిపాలన వ్యవహారాలు సాఫీగా సాగడానికి కేంద్రం తాత్కాలికంగా 44మంది ఐఎఎస్‌లను కేటాయించింది. తెలంగాణలో పరిపాలన యంత్రాంగం నడవడానికి 163మంది ఐఎఎస్‌లు, 112ఐపిఎస్లను 65మంది ఐఎఫ్‌ఎస్‌లను కేటాయించాలని నిర్ణయించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రత్యూష సిన్హ ఆధ్యర్యంలోని ఆరుగురు సభ్యుల కమిటీ చేసిన ఈ సిఫారసుకు డిపార్డ్‌మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి) ఆమోదం తెలిపింది.తెలంగాణలో వివిధ శాఖల్లో పని చేయడానికి తాత్కాలికంగా 9893ఉద్యోగులను కేటాయించారు.

నేడు ప్రమాణం చేయనున్న మంత్రులు వీరే..

1. ఈటెల రాజేందర్ 2. కొప్పుల ఈశ్వర్ 3. మహమూద్ అలీ 4. జోగు రామన్న 5. నాయిని నర్సింహారెడ్డి 6. పోచారం శ్రీనివాస్‌రెడ్డి 7. టీ హరీశ్‌రావు 8. కే తారకరామారావు 9. గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి 10. మహేందర్‌రెడ్డి 11. రాజయ్య

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.