Bharat Rashtra Samithi

Bharat Rashtra Samithi

KCR
telangana talli img

మనమే నంబర్ వన్

-వెనుకబడిన వర్గాలను శ్రీమంతులను చేయడమేలక్ష్యం -తెలంగాణ ఎగుమతుల రాష్ట్రంగా ఎదుగాలి -100 శాతం సబ్సిడీతో 30 వేల సెలూన్లు -చెరువులపై మత్స్యకారులకే హక్కులు -బీసీ, ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చాన్సు -దేవాదాయశాఖలో ఉద్యోగులుగా నాయీబ్రాహ్మణులు -ఏప్రిల్ 1 నుంచి 10 వరకు కులాలవారీగా సమావేశాలు -చిరునవ్వులతో బతికే తెలంగాణ కావాలి -జనహితలో ముఖ్యమంత్రి కేసీఆర్

కులం, మతంతో సంబంధంలేకుండా ప్రతి సామాజికవర్గాన్ని ఆర్థికంగా పైకి తీసుకరావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆనందంగా, సంతోషంగా ఉండాలనేది తమ ధ్యేయమని పునరుద్ఘాటించారు. బడ్జెట్‌లో వివిధ వర్గాలకు భారీ ఎత్తున కేటాయింపులు చేసినందుకుగాను కృతజ్ఞతలు తెలిపేందుకు మంగళవారం బేగంపేటలోని ప్రగతిభవన్‌కు వచ్చినవారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం వృద్ధిరేటులో ముందుందని చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్‌ల కంటే తెలంగాణ 21 శాతం వృద్ధితో ముందున్నది. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాల బడ్జెట్ కంటే రూ.నాలుగు వేల కోట్లు ఎక్కువగానే ఉంది. తెలంగాణ కోసం ఎందుకు కొట్లాడుతున్నరంటే ఆనాడే చెప్పినం.. మన ప్రాంతం నిధులు ఎక్కువ, కానీ ఆ నిధులను మన దగ్గర ఖర్చు పెట్టడంలేదని ఎన్నోసార్లు చెప్పినం. ఇప్పుడు మనం చెప్పిందే నిజమని తేలింది. వెనుకబడిన వర్గాలు పైకి వచ్చేవరకు నేను నిద్రపోను.. మిమ్ములను నిద్రపోనివ్వను అని కేసీఆర్ శపథం పూనారు. వివిధ వర్గాలు, అంశాలపై ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

వెనుకబడినవర్గాలు అభివృద్ధి చెందేంతవరకు వదులను.. భారతదేశంలో ఆర్థికంగా బలమైన యాదవులు, ముదిరాజ్, చేనేత వర్గాలు ఇతర వర్గాలు ఎక్కడున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేవిధంగా మనం తయారుకావాలి. అందుకు ప్రభుత్వం వద్ద కావాల్సినన్ని నిధులున్నాయి. నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కష్టపడి పనిచేసి పైకి రావాలి. వెనుకబడిన వర్గాలను వేల కోట్ల శ్రీమంతులను చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు అన్ని విధాలుగా సహకరిస్తాం. బీసీల్లో అనేక కులాలు దళితుల కంటే అధ్వాన్నంగా ఉన్నారు. వెనుకబడిపోయిన వర్గాలను వదిలిపెట్టేది లేదు. తెలంగాణ వచ్చేదాకా ఎట్లనైతే కొట్లాడిన్నో వెనుకబడినవర్గాల విషయంలో కూడా అంతే. పైకి వచ్చేదాకా వదిలిపెట్టేది ఉండదు. కేసీఆర్ ఒకసారి పట్టుపట్టిండు అంటే ఆ పని అయ్యేదాకా వదులడు. తెలంగాణనే సాధించుకున్న మనకు ఇదేమీ పెద్ద విషయం కాదు. సామాజిక వర్గాలను పైకి తీసుకురావడంలో ఇది ప్రారంభం మాత్రమే. పథకాల అమలు సొసైటీల ద్వారానే జరుగుతుంది. కులాలవారీగా చేసిన నిధులపై ప్రతి రెండుమూడు నెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తాం.

గల్ఫ్‌కు కూడా మాంసం ఎగుమతి చేయాలి.. ఆరెకటికలు వారి మటన్ షాపులు ఆధునీకరించుకోవడానికి నిధులు ఇస్తాం. మన అవసరాలకే కాదు ఇక్కడి నుంచి గల్ఫ్ దేశాలకు మటన్ ఎగుమతి చేసే స్థాయిలో మటన్ షాపులను నిర్వహించుకుందాం. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాల కోసం లబ్ధిదారులు ఎవ్వరు కూడా ఒక్క పైసా ప్రభుత్వ అధికారులకు కానీ, దళారులకు కానీ ఇవ్వొద్దు. మీ ఇండ్ల దగ్గరికే అధికారులు వచ్చి లబ్ధిదారులను ఎంపిక చేస్త్తరు. వాటిని అందిస్తరు. బీసీల్లో ఇంకా ఏమైనా సామాజిక వర్గాలకు నిధుల కేటాయింపు మిగిలిపోయి ఉంటే సీఎంగా నా దగ్గరున్న స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ద్వారా ఒక్క సంతకంతో నిధులు కేటాయిస్తా. కానీ.. అందరు కలిసి కష్టపడి పనిచేసుకోవాలి.. పైకి రావాలి. బ్రాహ్మణుల్లోనూ వెనుకబడినవారున్నారు. వారికోసం రూ.వంద కోట్లు కేటాయించినం. తెలంగాణలో ప్రతి మనిషి చిరునవ్వుతోటి, గర్వంతోటి కాలరెగరేయాలి.

మాకు భగవంతుడు ఇచ్చిన విద్య ఉంది.. ఆంధ్రాలో నాకో స్నేహితుడు.. మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ కాకినాడలో ఉన్నరు. చేపలను ఎట్లా పెంచొచ్చు, ఎట్ల పరిశ్రమగా చేయొచ్చునో నేను అసెంబ్లీలో చెప్పిన. ఆయన కాకినాడ నుంచి ఫోన్ చేసి నన్ను అభినందించారు.. మా ఆంధ్రావాళ్లకు బాగా గర్వం ఉండేది. చేపల పెంపకమంటే మాదే కదా మా దగ్గరనే రేవులు, సముద్రాలు ఉన్నాయి కదా అని.. ఇప్పుడు తెలంగాణలో ఏం లేకున్నా రూ.వేలకోట్ల పరిశ్రమ చేస్తానని చెప్పావు అన్నారు. ఆయనకు నేను.. మా దగ్గర భగవంతుడు ఇచ్చిన విద్య ఉంది. చెరువులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాకు అవకాశం రాలేదు అని బదులు చెప్పిన.

చిల్లర రాజకీయాల కోసం కాదు.. నేను ఇదంతా ఓట్ల చిల్లర రాజకీయాల కోసం చేయడంలేదు. ప్రజలకు మంచి చేస్తే.. తమకు మంచి జరిగిందని భావిస్తే వారే ఓట్లు వేస్తరు. ఇదే సంగతిని సిద్దిపేట ఎన్నికల్లో అనేకమార్లు ప్రత్యక్షంగా చూసిన. వెనుకబడినవర్గాలకు మంచి జరుగాలన్నదే నా లక్ష్యం. వెనుకబడిన కులాలను పైకి తీసుకరావడానికి నిధులు కేటాయించినం. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పది వరకు రోజుకు మూడు నాలుగైదు కులాల చొప్పున ఆయా కులాలకు సంబంధించిన ముఖ్యులను పిలిపించి మాట్లాడుతం. వారి సామాజికవర్గానికి కేటాయించిన నిధులను పారదర్శకంగా, లబ్ధిదారులకు చేరే విధంగా చర్యలు తీసుకుంటం. పుట్టినప్పటి నుంచి కాటికి వెళ్లేదాకా ప్రభుత్వంలో ఏదో ఒక పథకం ఉంది. మే నెల నుంచి పథకాలు మొదలు కావాలె.

చేపల వృత్తి చాలా పెద్దది.. ప్రస్తుతం కొన్ని చెరువులపై ప్రభుత్వ శాఖలకు, కొన్ని చెరువులపై కులాలకు హక్కులున్నాయి. ఇకపై ప్రతి చెరువులో చేపల పెంపకం, వాటి నిర్వహణ మొత్తాన్ని మత్స్యకారులకే అప్పగిస్తూ చట్టం తీసుకరావాలని సర్కారు నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ చట్టాన్ని ప్రవేశపెడుతం. ఉమ్మడి రాష్ట్రంలో చేపలంటే కృష్ణపట్నం, మచిలీపట్నం, కాకినాడ, విశాఖపట్నమనే అభూతకల్పన కల్పించారు. కానీ అది నిజం కాదని మనం నిరూపించబోతున్నం. ఉమ్మడి రాష్ట్రంలో చేపలను బేగంబజార్ బ్రోకర్లోల్లకు అప్పచెప్పిర్రు. ఇక గంగపుత్ర, బెస్త, ముదిరాజ్‌లు కాలర్ ఎగరేసుకుని చెప్పాలి… చేసి చూపించాలి మనవే చేపలని. చేప విత్తనం (పిల్లలను) కూడా మనమే తయారుచేయాలి. రాష్ట్రంలో 45,600 చెరువులున్నాయి. శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్, పులిచింతల, శ్రీరాంసాగర్, మంజీర, నిజాంసాగర్, సింగూరు ఇలా ప్రతి ప్రాజెక్టు బ్యారేజీలో చెరువుల పెంపకం చేస్తాం. గంగపుత్రులు, బెస్త, ముదిరాజ్‌లు అందరికి కావాల్సినంత పని ఉంటది. ఇంకా మరికొందరు చేసే విధంగా కూడా పని ఉంటుంది. దీనిలో ఎవరు ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్తగా దాదాపుగా 400 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టులు, బ్యారేజీలు నిర్మించబోతున్నం. ఎల్లంపల్లి, మేడిగడ్డ నిర్మాణాలు పూర్తి అయితే 54 కిలోమీటర్ల మేర 365 రోజులు నీరు నిల్వ ఉంటుంది. అప్పుడు మత్స్యకారులకు సంవత్సరం మొత్తం పని ఉంటుంది. వాటిలోనూ చేపల పెంపకం చేస్తాం. చేపల పెంపకంతో దానికి అనుబంధంగా అనేక పనులుంటాయి. ఐస్ తయారీ, రవాణాకు లారీలు సమకూర్చుకోవడం లాంటి పెద్ద ఎత్తున పని ఉంటుంది. కాబట్టి గంగపుత్రులు, బెస్తవారికి ఆందోళన అక్కరలేదు.

ఆ సామాజికవర్గాలకు ఎమ్మెల్సీలుగా అవకాశం వెనుకబడిన సామాజిక వర్గాలు, ఎంబీసీ వర్గాల్లోని అనేక కులాలకు చట్టసభల్లో అవకాశాలు రాలేదు. వారి వాయిస్ చట్టసభల్లో లేకుండా పోయింది. వారు ఎన్నికల్లో నిలబడినా తక్కువ సంఖ్యలో జనాభా ఉన్నందున గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీంతో ఈ వర్గాలకు రాబోయే రోజుల్లో ప్రత్యక్ష్య ఎన్నికల్లో కాకుండా ఎమ్మెల్సీ పదవులతోపాటుగా ఇతర పదవులు ఇస్తాం. అయితే దీనికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకు వేచి ఉండాలి. బోయవాళ్లను ఎస్టీలలో చేరుస్తం.

యాదవులకు 20వేల కోట్ల ఆదాయం రాష్ట్రంలో ప్రస్తుతం 45లక్షల వరకు గొర్రెలున్నాయి. వీటికి అదనంగా 88లక్షల గొర్రెలను 75 శాతం సబ్సిడీతో అందిస్తాం. రెండు సంవత్సరాల్లో ఒక గొర్రె మూడు ఈతలు ఈనుతుంది. నాలుగున్నర కోట్ల గొర్రెలయితయి. వీటిలో నాలుగు కోట్లను లెక్క వేసుకుని ఒక్కో దాన్ని రూ.5వేలకు అమ్మినా రూ.20వేల కోట్లవుతయి. వీటి ద్వారా రాబోయే రోజుల్లో యాదవులు రూ.20వేల కోట్లు ఆర్జించగలుగుతారు. శ్రీమంతులవుతారు. హైదరాబాద్‌కు ప్రతిరోజు ఇతర రాష్ట్రాల నుంచి 350 లారీల గొర్రెలను తెప్పించుకుంటున్నం. తెలంగాణ ప్రాంతం మొత్తానికి 600 లారీల గొర్రెలు తెచ్చుకుంటున్నం. ఇకపై గొర్రెలు వచ్చుడు బంద్ కావాలి.. ఇక్కడి నుంచి పోవుడే ఉండాలి. గొర్రెలకు అవసరమైన గడ్డిని పండ్ల తోటల్లో పెంచుకొని, మేపడానికి అనుగుణంగా రెండుమూడు రోజుల్లోనే జీవో ఇస్తాం. యంత్రాలు రావడంతో వస్ర్తాల చేనేత కార్మికులకు పనితగ్గింది. అదే సమయంలో ప్రభుత్వాలు వారి గురించి పట్టించుకోవడం మరిచినయి. వాళ్ల ఆకలిచావులను, ఆత్మహత్యలను నిరోధించేందుకు తెలంగాణ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో రూ.1200 కోట్లు కేటాయించినం. ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి కూడా ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించలేదు.

వంద శాతం సబ్సిడీతో 30వేల సెలూన్లు గ్రామాల్లో చెరువు గట్లమీద, చెట్ల కింద గడ్డం తీసుకోవడం, కటింగ్ చేయించుకోవడానికి యువత ఎవరూ ఆసక్తి చూపడంలేదు. పట్టణాలకు, మండల కేంద్రాలకు వెళ్లి సెలూన్లలోనే కటింగ్ చేయించుకుంటున్నారు. ప్రతి విలేజ్‌లో బ్రహ్మాండ మైన మాడ్రన్ సెలూన్ రావాలె. దీనికోసం నాయీ బ్రహ్మణులకు వంద శాతం సబ్సిడీతో 30వేల సెలూన్లు మంజూరు చేస్తాం. బ్యాంకులు, వేటితో సంబంధంలేకుండా ఇస్తాం. దేవాలయాల్లో తలనీలాలు తీసే నాయీబ్రాహ్మణులను దేవాదాయ శాఖ రెగ్యులర్‌గా ఉద్యోగులుగా చేస్తాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the BRS Party.