-సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రంగంలోకి దిగిన ప్రజాప్రతినిధులు -వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటూ మద్దతు -నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ

ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాషీగా తీసుకోవద్దు. పటిష్టమైన ప్రణాళికతో ముందుకు పోదాం. విద్యావంతులు, మేధావులకు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించి చెప్పండి. ప్రతీ కార్యకర్త.. తామే బరిలో ఉన్నామనుకొని శ్రమించాలి. పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోండి. గెలుపు ఖాయమయ్యేలా వ్యూహాలను అమలు చేసి వాణీదేవిని గెలిపించుకురండి. – హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్
నగర రాజకీయం మళ్లీ వేడెక్కింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల స్థానంలో గెలుపు కోసం అన్ని పార్టీలు కదన రంగంలో దిగాయి. కీలకంగా మారిన ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె వాణీదేవిని అభ్యర్థిగా ప్రకటించిన సీఎం కేసీఆర్..ఆమె విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలపై హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సోమవారం దిశానిర్దేశం చేశారు. బలమైన రాజకీయ నేపథ్యం, విద్యాధికురాలు కావడంతో వాణీదేవికి ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడినైట్లెంది. నామినేషన్ల దాఖలుకు మంగళవారం ఆఖరు. సోమవారం టీఆర్‌ఎస్ నుంచి సురభి వాణీదేవి, బీజేపీ నుంచి ఎన్ రామచంద్రరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకే రోజు 26 మంది, 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మె ల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యం గా టీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ప్రధా ని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవిని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బలమైన రాజకీయ నేపథ్యం, ఉన్నత విద్యావంతురాలు కావడం తో పట్టభద్రుల స్థానంలో ఆమెకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. టీఆర్‌ఎస్ పరంగానే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆమె అభ్యర్థిత్వానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. వాణీదేవి గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం ప్రగతిభవన్‌లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లను సీఎం కేసీఆర్ స్వయంగా సురభి వాణీదేవికి పరిచయం చేశారు. ఆమె గెలుపునకు ప్రతి ఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని ఆదేశించారు.
గ్రేటర్‌లో ‘ఎమ్మెల్సీ’ హీట్ వచ్చే నెల 14వ తేదీన జరిగే మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నెల 16న ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేయగా, కీలకమైన నామినేషన్ల దాఖలు నేటితో ముగుస్తున్నది. సోమవారం ఒక్క రోజే 26 మంది 47 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 90 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
కోలాహలంగా జీహెచ్‌ఎంసీ కార్యాలయం ఎంపీ కేశవరావు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ ప్రజాప్రతినిధులతో కలిసి టీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి తొలుత నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద, ఆ తర్వాత గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించారు. అక్కడి నుంచి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో రావడంతో జీహెచ్‌ఎంసీ కార్యాలయం కోలాహలంగా మారింది.
ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి దేశానికి వన్నె తీసుకువచ్చిన వ్యక్తి పీవీ నర్సింహారావు అని, పీవీకి సరైన గౌరవం దక్కాలంటే వాణీదేవిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. ఎంపీ కేశవరావు మాట్లాడుతూ విద్యాసంస్థలు నడిపిన వ్యక్తిగా, దేశవ్యాప్తంగా అన్ని అంశాలపై విశేష అనుభవం వాణీదేవికి ఉందని, ఎమ్మెల్సీగా వాణిదేవి శాయశక్తులా సేవ చేస్తుందని అన్నారు.
రాష్ర్టాభివృద్ధికి కృషి చేస్తా విద్యారంగంలో ఉన్న అనుభవంతో ఎమ్మెల్సీగా ఎన్నికై రాష్ర్టాభివృద్ధికి తనవంతు కృషి చేస్తా. ఎన్నికలో కచ్చితంగా గెలుపొందుతాననే నమ్మకం ఉంది. విద్యారంగంలో తాను అనేక సేవలు చేశానని, విద్యాసంస్థలను నెలకొల్పే విషయంలో, టీచర్‌గా సేవలందించాను. సీఎం కేసీఆర్ నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి సర్వీస్ చేస్తా. – టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి
యావత్ తెలంగాణ హర్షిస్తుంది మాజీ ప్రధాని పీవీ నరసింహారావును కాంగ్రెస్ విస్మరించిన విషయం ప్రజలు మరచిపోలేదు. కాంగ్రెస్‌కు చెందిన వ్యక్తి అయినప్పటికీ పీవీపై సీఎం కేసీఆర్‌కు ఎంతో గౌరవం ఉంది. జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ యేటా పీవీని స్మరించుకుంటున్నారు. మహోన్నత వ్యక్తి కూతురును ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున నిలబెట్టడాన్ని యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తుంది. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. పీవీ కూతురు సురభి వాణీదేవి విజయానికి కృషి చేస్తాం. – దుర్గెంపూడి సాంబిరెడ్డి, తెలంగాణ నర్సింగ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ
సీఎం నిర్ణయం సరైనదే.. పీవీ విజ్ఞాన వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న సురభి వాణీదేవి గొప్ప విద్యావేత్తతోపాటు మంచి చిత్రకారిణి. పీవీకి విద్యాపరమైన వారసురాలిగా ఆమెకు మంచిపేరు ఉంది. వాణీదేవిని పెద్దల సభకు పంపించాలనే సీఎం కేసీఆర్ నిర్ణయం సరైనదే. ఆమెను తప్పకుండా గెలిపించుకుంటాం. – డాక్టర్ జె. చెన్నయ్య, తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి
న్యాయం జరుగుతుంది.. చట్టసభలకు వాణిదేవిని పంపించాలనే ఉద్దేశం చాలా మంచిది. ఆర్థికంగా దేశం అభివృద్ధి చెందేలా సంస్కరణలు చేపట్టిన మాజీ ప్రధాని పీవీ కూతురు వాణీదేవి చట్టసభల్లో ఉంటే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాల విషయంలో యువతకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి న్యాయం చేకూరుస్తారనే నమ్మకం ఉంది. – డాక్టర్ ఖాజాపాషా, సినీ దర్శకులు, తెలుగు వర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థి
మా మద్దతు పీవీ కుటుంబానికే దేశానికి విస్తృత సేవలందించిన భారత మాజీ ప్రధాని పీవీ కుటుంబానికి టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం అభినందనీయం. గత పాలకులు ఆ మహానుభావుడిని గౌరవించలేదు. విద్యావంతులు కలిసికట్టుగా వాణీదేవికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. తాము సైతం పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తున్నాం. – ధీటి మల్లయ్య (తెలంగాణ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు )
వాణీదేవి గెలుపే పీవీకి ఘన నివాళి పట్టభద్రులు పీవీ కుటుంబానికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. వాణీదేవికి పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం మంచి పరిణామం. కాంగ్రెస్ పార్టీ పీవీని విస్మరించింది. ఎమ్మెల్సీగా ఆమెకు పూర్తి మద్దతు ఇవ్వాలి. పట్టభద్రులు ఆలోచించి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలి. – ఆదరాసుపల్లి శ్యామోహన్ శర్మ, మాజీ డిప్యూటీ తహసీల్దార్
గౌరవంగా భావిస్తున్నాం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా దేశ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ ఎంపిక చేయడం సంతోషకరమైన విషయం. ఎమ్మెల్సీ స్థానానికి ఒక మహిళను ప్రకటించి బీ ఫామ్ అందజేయడం గౌరవంగా భావిస్తున్నాం. సీఎం కేసీఆర్ ఉపాధ్యాయుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరుతున్నాం.- కుడుముల భాస్కర్ రెడ్డి, ప్రభ్వుత్వ ఉపాధ్యాయుడు
మహిళా అభ్యర్థిని ప్రకటించడం సంతోషకరం మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణీదేవిని ఎమ్మెల్సీ స్థానానికి ప్రకటించడం సంతోషకరంగా ఉంది. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. మహిళను ఎంపిక చేయడం మరింత హర్షించదగ్గ విషయం. ఎమ్మెల్సీగా వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించి పీవీ పేరు నిలబెట్టాలి. – డి.లక్ష్మీదాసు, ప్రైవేట్ టీచర్
వాణీదేవికి సంపూర్ణ మద్దతు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావును కాంగ్రెస్ పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ పీవీకి గౌరవ సూచకంగా పీవీఘాట్‌ను ఏర్పాటు చేశారు. యేటా జయంతి, వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ స్మరించుకుంటున్నారు. ఇప్పుడు పీవీ కూతురు సురభి వాణీదేవికి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పించడం సీఎం కేసీఆర్ మరోమారు బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తున్నారనడానికి నిదర్శనం. సురభి వాణీదేవికి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. – కాండూరి కృష్ణమాచారి, తెలంగాణ దేవాదాయ అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం: రాష్ట్ర బ్రాహ్మణ సంఘం రామంతాపూర్, ఫిబ్రవరి 22 : పట్టభద్రుల ఎమ్మెల్సీగా పీవీ కుమార్తె వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు శాస్ర్తుల రఘురామ శర్మ, ఆదరాసుపల్లి శ్యామోహన్‌శర్మ , ఇంగు నర్సింహమూర్తి, మధునూరి మహదేవశర్మ, ఏ.చంద్రశేఖర్‌శర్మ పిలుపునిచ్చారు. కాప్రలోని ల్యాండ్‌మార్క్ అపార్ట్‌మెంట్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పీవీ నర్సింహారావు తెలుగువారి గర్వపడే ఏకైక ప్రధాని అని కొనియాడారు. పీవీ కుమార్తె వాణీదేవిని టీఆర్‌ఎస్ గౌరవించి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అభినందనీయమన్నారు. ఆమె గెలుపుకోసం అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ బ్రాహ్మణ సంఘాలకు అండగా ఉంటున్నారని, వాణీదేవికి అవకాశమిచ్చిన ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు ఆదరాసుపల్లి భరత్‌కుమార్ శర్మ, మహిళా నేతలు వాణీమూర్తి, కల్యాణి, కుసుమ, లలితా, లావణ్య, నాగరాణి తదితరులు పాల్గొన్నారు.