-ఇప్పటివరకు ప్రభుత్వం సేకరించిన వడ్ల విలువ 9,600 కోట్లు
-మరో 10-12 లక్షల టన్నులు వచ్చే అవకాశం
-గత ఏడాది కంటే 11 లక్షల టన్నులు అధికం
-ధాన్యం కొనుగోలులో గత రికార్డులను చెరిపేస్తూ తెలంగాణ ప్రభుత్వం దూకుడును
ప్రదర్శిస్తున్నది. వానకాలం సీజన్‌లో ఇప్పటివరకు 50 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ దాదాపు ముగింపు దశకు చేరుకోగా.. గత ఏడాదికన్నా ఈ సారి 11లక్షల టన్నులు అధికంగా సేకరించింది. 8 లక్షల మంది రైతుల నుంచి సేకరించిన ఈ ధాన్యరాశి విలువ అక్షరాలా రూ.9600 కోట్లు!
రాష్ట్రవ్యాప్తంగా వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు ఎనిమిది లక్షల మంది రైతుల నుంచి 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ధాన్యం విలువ దాదాపు రూ.9,600 కోట్లు. ప్రభుత్వం మొత్తం 6,931 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, వాటిలో రెండు వేల కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. మిగిలిన కేంద్రాల్లో ఈ నెలాఖరు వరకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నదని భావిస్తున్నారు. మరో 10-12 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు రావొచ్చని అంచనా. ఈ సీజన్‌లో రికార్డు స్థాయి లో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాదాపు 1.50 కోట్ల టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఈ ఏడాది జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ధాన్యానికి భారీ డిమాండ్ ఉండటంతో ప్రభుత్వంతోపాటు ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు కూడా రైతుల నుంచి సొంతంగా కొనుగోలు చేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు, మిల్లర్లు కలిసి సుమారు 35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు అంచనాలు ఉన్నాయి. నిరుడు వానకాలం సీజన్‌లో ప్రభుత్వం 70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. నిరుడు ఇదే సమయానికి ప్రభుత్వం 39 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈ సీజన్‌లో ఇప్పటికే 50 లక్షల టన్నులు దాటింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది పంట చేతికి రావడానికి ముందే అధికారులు సకల సౌకర్యాలతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చర్యలు తీసుకొన్నారు. కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వెంట వెంటనే తూకం వేసి కొనుగోలు చేస్తున్నారు.