కాంగ్రెస్ వస్తే మన బతుకులు ఆగం
ధరణి పోర్టల్ తీసేస్తే అరిగోస పడుతం
రైతులారా.. ఆలోచించి ఓటెయ్యండి
కామారెడ్డి, నాంపల్లి, గోషామహల్, సికింద్రాబాద్ రోడ్‌షోల్లో కేటీఆర్
ధరణి పోర్టల్‌లో చిన్నపాటి లోపాలుంటే సవరించుకుందాం. ధరణి ద్వారా 90 శాతానికి పైగా రైతులకు లాభమే జరుగుతున్నది. ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగులబెట్టుకుంటామా?.
సమస్యలున్న చోట్ల ధరణి ద్వారా బాగు చేస్తాం.
-మంత్రి కేటీఆర్
రైతుల భూములకు రక్షణగా నిలిచిన ధరణి కావాలా? అన్నదాతలను అరిగోస పెట్టిన పట్వారీ వ్యవస్థ కా వాలో ఆలోచించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్‌తోనే తెలంగాణ రైతుల బతుకులు గాడిలో పడ్డాయని, ధర ణి ఎత్తేస్తే దళారీ వ్యవస్థతో మళ్లీ ఆగమవుడేనని హెచ్చరించారు. ధరణి ఎత్తెయ్యాలని, పాత పట్వారీ వ్యవస్థ తెస్తానంటున్న కాంగ్రె స్‌కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదివరకున్న కాలమ్స్ అన్నీ పెడుతామంటోన్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కోరారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, బీబీపేట మండలాలు, హైదరాబాద్‌లో నాంపల్లి అభ్యర్థి ఆనంద్‌గౌడ్, గోషామహల్ అభ్యర్థి నందకిశోర్‌వ్యాస్, సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా ఆయా నియోజకవర్గాల్లో కేటీఆర్ శనివారం రోడ్‌షో నిర్వహించారు. నాంపల్లి-మల్లేపల్లి చౌరస్తా, గోషామహల్-ఛత్రి చౌరస్తా, సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట రియో పాయింట్ హోటల్ , మైలార్‌గడ్డ ఎస్‌వీఎస్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ.. వచ్చే ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెసోడు వస్తే ధరణి స్థానంలో దళారీ వ్యవస్థ పురుడు పోసుకుంటుందని హెచ్చరించారు. సాగుకు 3 గంటల కరెంట్ సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. కామారెడ్డికి వచ్చి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్తుండు. 3 గంటల కరెంట్‌తోని 3 ఎకరాల పొలానికి నీరు పారుతుందా? అని ప్రజలను ప్రశ్నించారు. పారదు.. అంటూ రైతులు, జనమంతా గళమెత్తి చెప్పారు. ఇదే విధమైన స్పందనను నవంబర్ 30న ఓటు రూపంలో చూపించాలని కేటీఆర్ కోరారు.
కేసీఆర్‌తోనే 24 గంటల కరెంట్
వ్యవసాయ బోర్లకు 10 హెచ్‌పీ మోటర్లను పెట్టుకోవాలని కాంగ్రెస్ వాళ్లు చెప్తున్నారని, రైతుల వద్ద 10 హెచ్‌పీ మోటర్లు ఎందుకు ఉంటాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల వద్ద 10 హెచ్‌పీ మోటర్లు ఉన్నయా? అని ప్రజలను ప్రశ్నించగా, లేవంటూ వారంతా ముక్తకంఠంతో చెప్పారు. రేవంత్‌రెడ్డికి వ్యవసాయంపై కనీస పరిజ్ఞానం లేదనడానికి ఇది నిదర్శనమని చెప్పారు. 3 గంటల్లో 3 ఎకరాలు పారుతదని చెప్పినోడికి ఓట్లు వేయ్యొద్దని కోరారు. 24 గంటల కరెంట్ కావాలన్నోళ్లు కేసీఆర్‌కు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. రైతుబంధు 10 వేల నుంచి 16 వేలకు పెంచుతామని, పెట్టుబడి సాయాన్ని ఇంత భారీగా పెంచి ఇస్తున్న కేసీఆర్‌ను రైతులు వదులుకోవద్దని చెప్పారు. కేసీఆర్ వచ్చినంకనే బీడీ కార్మికులకు పింఛన్లు అందుతున్నాయని గుర్తుచేశారు. 2014 కటాఫ్ డేట్ ను ఎత్తేసి కొత్త వారికి సైతం బీడీ పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి ఏర్పాటయ్యాక కామారెడ్డి నియోజకవర్గం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
కామారెడ్డికి గోదావరి జలాలు
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కాళేశ్వరం జలాలు మంచిప్ప వరకు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. వచ్చే ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు గోదావరి జలాలను తీసుకు వస్తామని స్పష్టం చేశారు. రోడ్ షోలో ముందుకు కదులుతుంటే కరెంట్ తీగలు అడ్డుగా వచ్చాయని, వాటిని చూస్తే భయమైందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరెంట్ తీగలు బట్టలు ఆరబెట్టుకోవడానికే ఉపయోగపడ్డాయని ఎద్దేవాచేశారు. ఇప్పుడు నిరంతర విద్యుత్తు అందుతున్నదని స్పష్టంచేశారు. కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి పదేపదే కరెంట్ ఎక్కుడున్నదని అడుగుతున్నరని, దమ్ముంటే పెద్దమల్లారెడ్డికి వచ్చి ఈ కరెంట్ తీగలను పట్టుకోవాలని సవాల్ విసిరారు. నిరంతర విద్యుత్ అందుతున్నదా లేదా అన్నది అప్పుడు తెలుస్తుందని చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలో ఎవరైనా ఊర్లో చనిపోతే అంత్యక్రియల అనంతరం స్నానాలకు బతిమిలాడుకుని కరెంట్ ఇయ్యాలని కోరేదని గుర్తుచేశారు. రెండు టర్మ్‌లు కేసీఆర్ పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి పెద్ద ఎత్తున జరిగిందని స్పష్టంచేశారు. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టు కామారెడ్డికి కేసీఆర్ రావడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు కాని పనంటూ ఏదీ ఉండదని చెప్పారు. డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక 4 కొత్త పథకాలు మీ కోసమే అమలవుతాయని తెలిపారు.
ఎప్పటికైనా మనోడు మనోడే.. మందోడు మందోడే. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ రాహుల్, మోదీకి ఎందుకు ఉంటుంది. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారు.
మెజార్టీతో గెలిపియ్యాలి.
-మంత్రి కేటీఆర్
గోషామహల్‌ను దత్తత తీసుకుంటా
గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను గెలిపిస్తే మతాలు, కులాలు అంటూ కాలయాపన చేశాడు తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇక్కడి వ్యాపారస్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నంద కిశోర్‌వ్యాస్‌ను గెలిపిస్తే, నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని, మరో గచ్చిబౌలి తరహాలో అభివృద్ది చేస్తానని తెలిపారు. రోడ్‌షోల్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, స్టేట్ ఫుడ్ కమిషన్ మాజీ చైర్మన్ తిరుమల్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, ఎన్నికల ఇన్‌చార్జీలు పాటిమీది జగన్మోహన్‌రావు, మోతె శోభన్‌రెడ్డి, ఆర్‌వీ మహేందర్ కుమార్, ఆర్ చలపతిరావు, ప్రియాంకగౌడ్, రహముల్లా, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, నిట్టు వేణుగోపాల్‌రావు, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పట్వారీ వ్యవస్థతో నిండా మునుగుడే
ప్రజలను పీడించిన పట్వారీ వ్యవస్థతో నిండా మునుగుడే తప్ప ఇంకేమి ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. పట్వారీ వ్యవస్థను మళ్లీ తెస్తామంటున్న కాంగ్రెస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి వెళ్తూ మెదక్ జిల్లా రామాయంపేట శివారులోని ఓ హోటల్‌లో కేటీఆర్ కాసేపు ఆగి టీ తాగారు. మెదక్ ఎన్నికల వాతావరణంపై రామాయంపేట బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులను ఆరాతీశారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజల తీర్పు బీఆర్‌ఎస్‌కే అనుకూలంగా ఉంటుందని స్పష్టంచేశారు. పట్వారీ వ్యవస్థతో ప్రజలు, రైతులు విసిగి పోయారని అన్నారు. ఆ వ్యవస్థను తీసేసి తెలంగాణ ప్రభుత్వం ధరణి వ్యవస్థను తీసుకొచ్చి రైతుల ఇబ్బందులను తొలిగించిందని పేర్కొన్నారు.