-రూ.2,579 కోట్లతో వరంగల్ నగర అభివృద్ధి -గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆదరించాలి -మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి -టీఆర్‌ఎస్‌తోనే సామాజిక న్యాయం

దేశంలోనే సామాజిక న్యాయం పాటిస్తున్న రాజకీయ పార్టీ టీఆర్‌ఎస్ ఒక్కటేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మరోసారి సామాజిక న్యాయం పాటించిందని చెప్పారు. నగరంలోని 66 డివిజన్లలో కోటా ప్రకారం 20 సీట్లు రిజర్వు అయి తే… టీఆర్‌ఎస్ 39 డివిజన్లలో అవకాశం కల్పించిందని తెలిపారు. కోటా ప్రకారం మహిళలకు 33 డివిజన్లు ఉంటే టీఆర్‌ఎస్ 37 స్థానాలు కేటాయించిందని చెప్పారు. అన్‌రిజర్వుడు స్థానాల్లో ఎస్సీ, బీసీ మహిళలకు టీఆర్‌ఎస్ పోటీ చేసే అవకాశం కల్పించిందని తెలిపారు. బీసీల్లోనూ జనాభా ప్రకారం అన్ని కులాలకు అవకాశం కల్పించినట్టు వెల్లడించారు. బీసీల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలైన రజక, మేర, నాయీబ్రాహ్మణ, వారాల, దూదేకులకు ఎన్నికల్లో పోటీ చేసేలా టీఆర్‌ఎస్ సామాజిక సమతూకం పాటించిందని చెప్పారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి గ్యాదరి బాలమల్లు, టీఆర్‌ఎస్ నేత దాస్యం విజయభాస్కర్‌తో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం హన్మకొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. సామాజిక న్యాయం పాటించాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు అభ్యర్థుల ఎంపిక జరిగిందని తెలిపారు. ఆరున్నరేండ్లలో సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో, మున్సిపల్ మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో రూ.2,579 కోట్లతో వరంగల్ నగరం అభివృద్ధి చెందిందన్నారు.
బీజేపీ చేసిందేమీ లేదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వరంగల్ నగర అభివృద్ధికి ఎలాంటి సాయం చేయలేదని మంత్రి దయాకర్‌రావు ఆరోపించారు. కరోనా వ్యాక్సిన్, ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల కేటాయింపులోనూ తెలంగాణపై వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. సోషల్ మీడియాలో బీజేపీ, కాంగ్రెస్‌లు బోగస్ ప్రచారం చేస్తున్నాయని, ప్రజలు ఈ విషయాన్ని గుర్తించే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీలను కనిపించకుండా చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో వరంగల్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని.. ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు.