– త్వరలో సిరిసిల్లలో పవర్‌లూమ్ కార్మికుల సదస్సు – పోచంపల్లిలో నేత పట్టు కార్మికుల సదస్సు – నూరు శాతం చేనేత వస్త్రాలు కొనుగోలు చేసే యోచన పవర్‌లూమ్స్ ఆధునీకరణకు ప్రోత్సాహం
వస్త్రవైభవ పునఃప్రతిష్ఠకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సమగ్ర విధాన ప్రకటన రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ఒక సమగ్ర విధాన ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఈ దిశగా సిరిసిల్ల, పోచంపల్లిలో సదస్సులు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది.

చేనేత వస్త్రవైభవాన్ని పునఃప్రతిష్ఠించే దిశగా రాష్ట్రంలో అడుగులు పడుతున్నాయి. చేనేత రంగానికి పూర్తి స్థాయిలో అండగా నిలువాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు చేనేత మీద ఒక సమగ్ర విధాన ప్రకటన చేయనున్నారని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలో మగ్గాల మీద నేసే చేనేత వస్ర్తాలను నూటికి నూరు శాతం ప్రభుత్వమే కొనుగోలు చేయటం, పవర్‌లూమ్‌ల ఆధునీకరణకు ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి అంశాలు ఈ ప్రకటనలో ఉండే అవకాశముందని తెలిసింది.
తెలంగాణకు ప్రతిష్ఠాత్మకమైన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఇక్కత్ పట్టు వస్ర్తాల పరిరక్షణ- ప్రోత్సాహకాలకు ఈ ప్రకటనలో చోటుదక్కనుంది. తెలంగాణ ఉద్యమకాలంలో చేనేత కార్మికుల దైన్యాన్ని కండ్లారా చూసిన సీఎం కంటి తుడుపు చర్యలు కాకుండా వారి సమస్యలకు ఒక శాశ్వత సమగ్ర పరిష్కారం చూపెట్టాలని పట్టుదలగా ఉన్నారు. చేనేత ప్రాచీన వైభవాన్ని రక్షించడం, అదే సమయంలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఆచరణాత్మకంగా చేనేత రంగాన్ని ఆధునీకరించడం అనే రెండు అంశాల మధ్య సమన్వయ సాధనకు సీఎం పలువురు నిష్ణాతులతో చర్చించారు. ఈ దిశగా చేనేత కార్మికుల సమస్యలపై చర్చించి ఒక సమగ్ర విధానాన్ని, ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు త్వరలో సిరిసిల్లలో చేనేత కార్మికుల సదస్సును, పోచంపల్లిలో పట్టునేసే చేనే త కార్మికుల సదస్సును నిర్వహించాలని ప్రభు త్వం నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
తెలంగాణలో సుమారు 12 లక్షలకు పైగా పద్మశాలీ కుటుంబాలున్నట్టు ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో వెల్లడయింది. ఇందులో ఇప్పటికీ చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నవారు 15 శాతం మంది ఉన్నట్టుగా గుర్తించారు. ప్రధానంగా చేనేత వృత్తిలో ఉన్నవారు 9వేల లోపే. వీరిలో సుమారు ఏడువేల మంది సొసైటీలలో, సుమారు 900 మంది స్వతంత్రంగా చేనేత వస్ర్తాలు నేస్తున్నట్టు సర్వే వివరాలు చెప్తున్నాయి. ఇక పవర్‌లూమ్స్ సుమారు 50 వేల లోపు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 39 వేలు ఒక్క సిరిసిల్ల ప్రాంతంలోనే ఉన్నాయి. మిగిలినవాటిలో కొన్ని నల్లగొండ, వరంగల్, గద్వాల, నారాయణపేట ప్రాంతాల్లో ఉన్నాయి. అటు పవర్‌లూమ్స్‌పైన, ఇటు చేనేతపైన పనిచేస్తున్న కార్మికుల సంఖ్య సుమారు 50వేల వరకు ఉంటుందని అంచనా. కష్టనష్టాలున్నా ఈ వృత్తిని వదులుకోలేక, అందులోనే కొనసాగుతూ ఇబ్బందుల పాలవుతున్న కార్మికుల సమస్యకు ఒక శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం కనుగొనాలని ప్రభుత్వం భావిస్తున్నది.
ఆత్మహత్యలు లేని రోజు చూడాలి ఆత్మహత్యలు లేని రోజు చూడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేసీఆర్, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం కేవలం రాజకీయాలనుంచి రాజకీయాలకోసం పుట్టింది కాదు. తెలంగాణ కన్నీటిబొట్టు నుంచి, కడగండ్ల నుంచి పుట్టింది. తెలంగాణ సామాజిక బలగం, తెలంగాణ బలం, బలహీనత అన్నీ ఆయనకు తెలుసు. చేపల పెంపకం, గొర్రెల పెంపకందారులు మొదలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల సమస్యల చిక్కుముడులను ఒక్కొక్కటే విప్పే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ నీటిబొట్టు గురించి తెలుసు. గుండెతడి గురించి తెలుసు. ఆ వరుస క్రమంలోనే ఇప్పుడు చేనేత కార్మికుల సమస్యకు ఒక పక్కా ప్రణాళిక రచించాలని ఆయన కృషిచేస్తున్నారు అని చేనేత కార్మికుల సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన సీనియర్ ఎంపీ ఒకరు చెప్పారు.
కొంతకాలంగా కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, పురపాలన, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు, విద్యుత్ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూరనర్సయ్యగౌడ్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఆయా ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు చేనేత కార్మికుల సమస్యల శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రికి పదేపదే విజ్ఞప్తులు చేస్తూ ఒత్తిడి తెస్తున్నారు. టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రం నుంచి అందే పథకాలకు సంబంధించి సమాచారం సేకరించి చేనేత విధాన రూపకల్పనలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు.
త్వరలోనే కీలక నిర్ణయాలు రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే చేనేత వస్ర్తాలను నూటికి నూరు శాతం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవడం, పవర్‌లూమ్స్‌ను ఆధునీకరణకు అన్ని రకాల సహాయ సహకారాలందించడం, మార్కెట్ అవసరాలను గుర్తించి తదనుగుణంగా చేనేతదారులు ఏ ఉత్పత్తులు తీసుకోవాలో మార్గదర్శనం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వం త్వరలోనే కీలక నిర్ణయాలు తీసుకోనున్నది. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఇక్కత్ పట్టు చీరల నేత సంప్రదాయాన్ని పరిరక్షించడంతోపాటు, వారికి అన్నిరకాల ప్రోత్సాహకాలు అందించి, ఆ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సహాయసహకారాలు అందించాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది. సిరిసిల్ల, పోచంపల్లిలలో జరిగే సదస్సులలో చేనేత రంగానికి సంబంధించి ఒక బలమైన భరోసా ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ సదస్సులు జరిగే లోపు చేనేత సమస్యలపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు త్వరలో ప్రగతి భవన్‌లో వివిధ ప్రాంతాలకు సంబంధించిన చేనేత కార్మికులను పిలిపించి మాట్లాడాలని ప్రభుత్వం భావిస్తున్నది.