-మోదీ.. కోచ్ ఫ్యాక్టరీ మాయమా.. ఇచ్చేది రిపేర్ల దుకాణమా
-గిరిజన వర్సిటీ, బయ్యారం స్టీల్‌ప్లాంట్ ఎటుపాయె?
-ఆదివాసీ, గిరిజనుల మూడు డిమాండ్లు నెరవేర్చాం
-స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు పంపిణీ
-గిరిజనులు దశాబ్దాలుగా కొట్లాడింది వీటికే: కేసీఆర్

బయ్యారంలో ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ పెట్టకుండా, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా గుజరాత్‌కు తరలించుకుపోయినందుకు తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణ చెప్పాలి. గుజరాత్‌లో రూ.21 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెడతారు. తెలంగాణలో మాత్రం పెట్టరు. రిపేరు దుకాణం పెడతరట. ఇది ఏరకంగా న్యాయం? గుజరాత్‌కు ఒక న్యాయం. తెలంగాణకు ఒక న్యాయమా? ఇది మంచిది కాదు ప్రధానిగారు. మీరు దేశానికి ప్రధాని కానీ, గుజరాత్‌కు కాదు.
– మంత్రి కేటీఆర్
రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాల్సిందేనని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రైళ్ల తయారీ కర్మాగారం పెడతామన్న హామీని విస్మరించి రైళ్ల మరమ్మతుల దుకాణం పెడుతున్నందుకు తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీకి బదులుగా రైలు మరమ్మతుల దుకాణం పెడితే కుదరదని నిప్పులు చెరిగారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులతోపాటు గిరిజన రైతులు సాగుచేసుకుంటున్న పోడుభూములకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. ములుగు జిల్లా కేంద్రంలో 360 ఎకరాల భూమిని ఇచ్చినప్పటికీ గిరిజన యూనివర్సిటీని ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం హామీ ఏమైందని నిలదీశారు. వరంగల్ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
-గుజరాత్‌కు ఒక న్యాయం.. తెలంగాణకు ఒక న్యాయమా?
-హామీలు నెరవేర్చనందుకు ప్రధాని నరేంద్రమోదీ క్షమాపణ చెప్పాలి
-50 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ గుడ్డిగుర్రాల పండ్లు తోమిందా?
-కాంగ్రెసోళ్లను నమ్మితే.. ప్రజలను ఆగం చేస్తరు తస్మాత్ జాగ్రత్త
-పోడు పట్టాల పంపిణీ సభలో బీజేపీ, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్

కాంగ్రెస్‌ను నమ్మితే ఆగమైపోతాం
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మితే ఆగమైపోతామని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. ‘ఇన్నేండ్లు పాలించిన కాంగ్రెసోళ్లు గుడ్డిగుర్రాల పండ్లు తోమిండ్లా..? ఇప్పుడు ఇది ఫ్రీ.. అది ఫ్రీ.. అని చెప్తున్నారు. వాళ్ల మాటలు వింటే చక్కెర వచ్చి పడిపోతరు. ఎనకటికి ఒక దర్జీ ఉండే.. పండుగ సీజన్‌లో బట్టలు స్పీడ్‌గా కుడుతుంటే సూది కింద పడ్డది. చీకటి అయ్యింది. కరెంట్ లేదు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. కరెంట్ లేక దేవులాడితే దొరకలె. బట్టలు కుట్టాలె.. బయట కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు. ఏమి చేయాలో తోచలె. అటు తిరిగితే కురవి వీరభద్రస్వామి బొమ్మ కనిపిస్తే.. దేవుడా దేవుడా నా సూది దొరికితే 5 కిలోల చక్కెర, అర కిలో బెల్లం, పది కొబ్బరికాయలు వెంటనే వచ్చి ఇస్తా అని మొక్కిండట. ఇంతలో భార్య వచ్చి.. నీకు బుద్ధిందా.. పది పైసల సూది కోసం ఇవన్ని ఇస్తవా? అని అడిగిందట. వెంటనే ఆ దర్జీ.. ముందు సూది దొరకనియ్.. తరువాత దేవుడు అడుగుతాడ అన్నాడట. కాంగ్రెసోళ్ల కథ కూడా ఇట్లనే ఉంటది. ఆగం కాకండి. 50 ఏండ్లు ఆగమైంది చాలు. ఇక చాలు వారి మోసాలు. పేదలను కడుపులో, గుండెలో పెట్టుకొని చూసుకుంటున్న సీఎం కేసీఆర్‌ను తిరిగి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించి మళ్లీ పేదల కోసం పని చేసే విధంగా కలిసికట్టుగా నడుద్దాం’ అని పిలుపునిచ్చారు.
పోడు రైతులకు పట్టాభిషేకం
ఇవాళ పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ 1.51 లక్షల మంది పోడు రైతులకు 4.06 లక్షల ఎకరాల భూమికి పట్టాలు అందజేస్తున్నారని కేటీఆర్ వివరించారు. మహబూబాబాద్ జిల్లాలో 24,181 మంది రైతులకు 67,730 ఎకరాల భూమిని గిరిజన కుటుంబాలకు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఒక్క మానుకోట పట్టణానికే రూ.50 కోట్ల నిధులు వచ్చాయంటే అందుకు కారణం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమేనని చెప్పారు.
జల్, జంగల్, జమీన్ స్ఫూర్తితో
తెలంగాణ పోరాటయోధుడు, గిరిజన బిడ్డ కుమ్రంభీం ఇచ్చిన జల్, జంగల్, జమీన్ నినాదం స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి పాటుపడుతున్నారని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈరోజు జల్,జంగల్, జమీన్ స్పూర్తితో 4.06 లక్షల ఎకరాలకు పట్టాలు గిరిజనుల చేతికి వస్తున్నాయని చెప్పారు. పోడు భూములకు పట్టాలతోపాటు రైతుబంధు, రైతుబీమా కూడా జూలై నుంచే ఇస్తున్నామని స్పష్టంచేశారు.
మానుకోట అభివృద్ధి బాట
మానుకోటలో ఈ రోజు ఉదయం నుంచి ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించారని కేటీఆర్ వివరించారు. రూ.50 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వెల్లడించారు. రెవెన్యూ డివిజన్‌గా ఉన్న మహబూబాబాద్ జిల్లా కేంద్రంగా మారడానికి కేసీఆర్ కారణమని చెప్పారు. కలలో కూడా ఊహించని విధంగా మానుకోటకు ప్రభుత్వ మెడికల్ కళాశాల, దానితోపాటు జిల్లా దవాఖాన వచ్చిందని చెప్పారు. ఒకనాడు ఇక్కడ పదిమంది డాక్టర్లు ఉంటే ఇప్పుడు 140 మంది డాక్టర్లు అయ్యారని గుర్తుచేశారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్, రెడ్యానాయక్, హరిప్రియ, ఆరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి, బస్వరాజ్ సారయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్ తదితరులు పాలొన్నారు.