ప్రభుత్వానికి భారమైనా మానవీయ కోణంలోనే నిర్ణయం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పథకం అమలు 3 లక్షల మంది ఒంటరి మహిళలకు లబ్ధి శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు నిరూపించారు. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న పేద మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు వారికి నెలకు వెయ్యి రూపాయలు జీవనభృతి ఇవ్వాలని నిర్ణయించినట్టు శుక్రవారం అసెంబ్లీలో సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

రాష్ట్రంలోని పేద ఒంటరి మహిళలకు ప్రతి నెలా వెయ్యి రూపాయల జీవనభృతి పథకం వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి వస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాలు ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ సభలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం లభించేలా, సామాజిక వర్గాలన్నీ ఆర్థిక స్థోమత, ఆత్మగౌరవంతో జీవించేలా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు అనుగుణంగా పరిపాలనలో అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తుంది. రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం సంక్షేమరంగానికే కేటాయించింది. మాది పేదల పక్షపాత ప్రభుత్వమని తెలంగాణ ప్రజలు ఇప్పటికే గ్రహించారు. అందుకే అడుగడుగునా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు అని చెప్పారు.
రాజకీయ పార్టీలు చాలావరకు మ్యానిఫెస్టోలో ఉన్న నిర్ణయాల అమలుకే పరిమితమవుతాయని, కానీ తమ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ప్రస్తావించకపోయినా, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా నిర్ణయాలు తీసుకుంటున్నదని తెలిపారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు వృద్ధులకు, వితంతువులకు, దివ్యాంగులకు ఆసరా పేరుతో పెద్ద ఎత్తున పింఛన్లు అందిస్తున్నాం. బీడీ కార్మికుల కష్టాలు గమనించి వారికి ప్రతినెలా రూ.వెయ్యి జీవనభృతిని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉద్యమాలు చేసినా న్యాయం దక్కలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మేం అడుగకముందే న్యాయం చేసింది అని బీడీ కార్మికులంతా సంతోషపడుతున్నారు అని సీఎం తెలిపారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెండ్లి ఖర్చు కోసం తల్లిదండ్రులు పడుతున్న బాధలు సానుభూతితో అర్థం చేసుకున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనివిధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వీటిద్వారా రాష్ట్రంలో వేల కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లికోసం 51వేల చొప్పున ఆర్థికసాయం అందిందని చెప్పారు.
మానవీయ కోణంలోనే ఈ నిర్ణయం మ్యానిఫెస్టోలో ప్రస్తావించకున్నా మానవీయ కోణంలో ఆలోచించి మరో నిర్ణయాన్ని సభలో ప్రకటిస్తున్నాను. రాష్ట్రంలో ఒంటరిగా జీవితం గడుపుతున్న పేద మహిళలు పడుతున్న కష్టాలు తీర్చేందుకు, వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అవసరమనే విషయం గత కొంతకాలంగా ప్రభుత్వం దృష్టికి వస్తున్నది. ముందుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని సాధ్యాసాధ్యాలను గుర్తించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాం. కానీ రాష్ట్రంలో దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది నిస్సహాయులైన పేద ఒంటరి మహిళలకు జీవన భద్రత కల్పించేలా ప్రతి నెలా వెయ్యి రూపాయలు అందించి వారిని ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మార్చిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఇందుకు నిధులు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పేద ఒంటరి మహిళల వివరాలు నమోదు చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేద ఒంటరి మహిళలంతా తమ పేర్లను ప్రభుత్వం వద్ద నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. శాసనసభ్యులంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అసలైన ఒంటరి మహిళలకు మాత్రమే సహాయం అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి పేర్ల నమోదు కార్యక్రమాన్ని బాధ్యతను తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. రాష్ట్ర ఖజానా మీద పడే భారాన్ని లెక్క చేయకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ మానవీయ నిర్ణయాన్ని ఈ సభ ముక్త కంఠంతో స్వాగతిస్తుందని ఆశిస్తున్నానని సీఎం చెప్పారు.
ఒంటరి మహిళలకు పింఛన్లపై మహిళా సంఘాల హర్షం ఒంటరిగా ఉంటున్న మహిళలకు రూ.వెయ్యి జీవనభృతి కల్పించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్రవ్యాప్తంగా మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో మహిళా సంఘ సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కే చంద్రశేఖర్‌రావును మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వీ శ్రీనివాస్‌గౌడ్ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.