-యువకిశోరాల బలిదానాలు తీవ్రంగా కలిచివేశాయి
-ఆఫీసు కూలగొట్టిన చోటే.. అమరజ్యోతి నిర్మాణం
-నాపై జరిగినంత దాడి ఏ నేత పైనా జరుగలేదు
-అమరజ్యోతి ప్రారంభ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
-అమరుల స్థూపం నుంచి అమరుల దీపం దాకా..
-జూన్ 2న గన్‌పార్క్‌లో మొదలైన దశాబ్ది సంబురాలు
-మూడు వారాల వేడుకలు స్మృతిజ్యోతి వద్ద పరిసమాప్తం
21 రోజులపాటు ఘనంగా జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ది సంబురాలకు ఇది పతాక సన్నివేశం. అట్టహాసంగా నిర్వహించిన వేడుకలకు ఇది భావోద్వేగ ముగింపు.
ఉరితాళ్లను.. పూలదండలు చేసుకున్నవారికి
పురుగు మందులను.. పరమాన్నంలా తాగిన వారికి
పెట్రోలుతో.. పుణ్యస్నానాలు ఆచరించిన వారికి
రైలు పట్టాల సాక్షిగా.. అమరత్వపు మెట్లెక్కిన వారికి
మన యోధులకు.. మన తెలంగాణ అమరవీరులకు..
జోహార్లు.. జోహార్లు.. జోహార్లు..
-ఆ ఆత్మార్పణ వృథా కాలేదు.
తెలంగాణ బిడ్డల వందేండ్ల నిండు జీవితాలను
త్యాగం చేసిన ఫలమే.. ఈ పదేండ్ల పండుగ.
చీకట్లతో కొట్లాట ఫలితం.. నిరంతర విద్యుత్తు కాంతులు
కన్నీళ్లను దిగమింగిన దాఖలాలు.. కాళేశ్వరం జలాలు
నిరుద్యోగుల ఆక్రందన ప్రభావాలు.. స్థానికులకే ఉద్యోగాలు
పోలీసుల తుపాకులకు ఎదురొడ్డిన గుండెబలం..
దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టిన సుసంపన్న రాష్ట్రం
మొక్కుబడిగా గుర్తుచేసుకోవడానికి
మరిచిపోయేంత చిన్న త్యాగమా అది?
మూడు నిమిషాల మౌనంతో తీరిపోయే రుణమా అది?
తెలంగాణ కలలను సాకారం చేశారు.

వారి సంకల్పానికి సలాం..
రాష్ట్రసాధన కోసం అసువులు బాసిన అమరులకు గుండెల్లో గుడి కట్టుకున్నది తెలంగాణ. హైదరాబాద్ నడిబొడ్డున సగర్వంగా అమరజ్యోతిని వెలిగించుకున్నది. ‘జై తెలంగాణ’ అంటూ పిడికిలెత్తితే రబ్బరు బుల్లెట్లు, బాష్పవాయు గోళాలు, జలఫిరంగులు విరుచుకుపడిన చోట.. ఇనుపకంచెలను చీల్చుకుని సాగర తీరాన మిలియన్ మార్చ్‌లో ఒక్కగొంతుకై నినదించిన చోట.. అస్తిత్వ పతాకను సమున్నతంగా ఎగురవేసిన అపూర్వ క్షణాలివి. అమరుల యాదిలో ఆర్ద్రనయనాల ఉద్విగ్న క్షణాలివి. నాటి తలపులతో తల్లడిల్లిన చోట.. త్యాగధనుల స్ఫూర్తిని తరతరాలు యాది చేసుకునేలా మహా దీపకళికను వెలిగించుకున్న సందర్భమిది.
ఆనాటి ఉద్యమ నేత.. ఈనాడు ముఖ్యమంత్రి. పదేండ్ల తెలంగాణ ప్రగతి పాదముద్రలు దేశానికి కొత్త బాటను చూపుతున్న తరుణంలో.. గడిచిన క్షణాలను, నడిచివచ్చిన దారిని, ఉద్యమ సహచరులను గుర్తు చేసుకున్నారు కేసీఆర్. ప్రపంచమే అబ్బురపడేలా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించుకున్న అమరజ్యోతిని గురువారం హుస్సేన్‌సాగర్ తీరాన ఆయన ప్రారంభించారు. తెలంగాణ వీరుల త్యాగాలను, ఉద్యమకాలపు స్మృతులను గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రగతిశీల పాలన తెలంగాణ బిడ్డల తల నిమురుతున్నప్పుడు..
సంక్షేమ సారథి కడుపులో పెట్టుకొని కాపాడుతున్నప్పుడు…
ఆర్తులను, అసహాయులను గదువ పట్టుకొని ఓదారుస్తున్నప్పుడు
రేపటిని కలగన్న అమరులు దిగంతాల మీదినుంచి దీవిస్తున్నరేమో!
అమరులను స్మరించుకుంటూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు ముగింపు పలకాలని అనుకున్నాం. రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. తీవ్రంగా కలిచివేసిన బలిదానాలు వారివి. ఈ రోజు రెండు పార్శాలు కలగలిసిన రోజు. సంతోషం ఒక పాలు. విషాదం రెండు పాళ్లుగా ఉన్నాయి.
– సీఎం కేసీఆర్
‘అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా, ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మనం ఎంత జాగ్రత్తతో దీనిని ముందుకు తీసుకుపోవాలో సీఎంలు, సీఎస్‌లు, మంత్రులందరికీ తెలియజెప్పేలా అమర జ్యోతికి రూపకల్పన చేశాం’ అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. నిర్మాణం ప్రత్యేకంగా ఉండేలా, అమరులకు నిత్యం జ్యోతి పట్టినట్టుగా దీపకళిక నిర్మాణం చేపట్టామని చెప్పారు. సచివాలయం ముందు నిర్మించిన అమరజ్యోతిని సీఎం కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని ఉద్యమం నడిపానని గుర్తుచేశారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఉద్యమం ప్రారంభించామని, ఒక్క బలిదానం కూడా జరుగకూడదని అహర్నిశలు శ్రమించామని తెలిపారు. అయితే తాను నిరాహార దీక్ష చేసిన సమయంలో పరిస్థితి అనుకోని మలుపు తిరిగిందని, తమ చావుతోనైనా కేంద్రం కండ్లు తెరువాలంటూ కొందరు ఆత్మ బలిదానాలు చేయటం తనను ఎంతో కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగాలు వెలకట్టలేనివని శ్లాఘించారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమ ఘట్టాలను గుర్తుచేస్తూ సాగిన సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ఇల్లెందులో ఉద్యమ తొలి పొలికేక
దశాబ్ది ఉత్సవాలు సంతోషంగా నిర్వహిస్తున్నాం. అమరులను స్మరించుకుంటూ ఉత్సవాలకు ముగింపు పలకాలని అనుకున్నాం. రాష్ట్ర ఉద్యమ చరిత్ర చాలా పెద్దది. ఈరోజు రెండు పార్శాలు కలగలిసిన రోజు. సంతోషం ఒక పాలు. విషాదం రెండు పాళ్లుగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోపేర్లు తలుచుకోవాలి. రాష్ర్టాన్ని విలీనం చేయటంలోనే అనేక కుట్ర కోణాలు దాగి ఉన్నాయి. అమాయకులైన ఆనాటి తెలంగాణ రాజకీయ నాయకత్వం, ప్రజలు ఏదో మంచి జరుగుతుందనే నమ్మకంతో అంగీకరించారు. ఫలితంగా తెలంగాణ సమాజం బలైపోయింది. ఆ తర్వాత ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలకే ఇబ్బందులు మొదలయ్యాయి. మొట్టమొదట ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఒక ఉద్యమ పొలికేక వచ్చింది. రెండేండ్లలో అది యూనివర్సిటీలకు పాకింది. ఇప్పుడు నా ముందున్న స్వామిగౌడ్ అక్కడే ఉన్నారు. చాలా ధైర్యంగా 58 ఏండ్ల సమైక్య ఉద్యమంలో కూడా తమ అస్తిత్వాన్ని కోల్పోకుండా టీఎన్జీవోలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉద్యమంలోకి దిగారు. ఎన్నో కేసులు, వేధింపులు, భయంకరమైన పీడీ యాక్టులు, ఉద్యోగాల బర్తరఫ్‌లు.. ఇలా తెలంగాణ అనుభవించని బాధ లేదు. ఆనాటి టీఎన్జీవో నేత ఆమోస్‌ను మీసా యాక్టు కింద పెట్టి వేధించారు. ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగులకు జీతా లు ఇవ్వకుండా అవస్థలు పెట్టారు. అప్పట్లో బద్రి విశ్వాల్ అనే ఒక వ్యాపార వేత్త బక్కెట్లు పట్టుకుని బే గం బజార్‌లో దకాణాదారుల దగ్గర డబ్బులు అడిగి జీతాలు ఇచ్చి కుటుంబాలను ఆదుకున్నారు.

పిడికెడు మందితో ఉద్యమం ప్రారంభించాం
తెలంగాణ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించాం. మొదట్లో నా మిత్రుడు వీ ప్రకాశ్, మధుసూదనాచారితో కలిసి కనీసం ఆరు, ఏడు నెలలపాటు మేధోమథనం చేశాం. ఏం చేద్దాం? ఎలా ముందుకెళ్దాం అని ఆలోచించాం. ఏం జరిగినా ఈ సారి తెలంగాణను సాధించి తీరాలని అనేక మంది మేధావులతో చర్చలు జరిపాం. ఒక పకడ్బందీ వ్యూహం రచించుకుని బయలుదేరాం. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఇప్పుడు మన మధ్య లేరు. ఆయన ఆజన్మ తెలంగాణ వాది. అనేకమంది అనేక రూపాల్లో పదవుల కోసమో, డబ్బుల కోసమో, రాజకీయ ఒత్తిళ్లు, పోలీసు వేధింపులు ఇలా.. ఏదోరకంగా రాజీ పడ్డారు. కానీ.. జయశంకర్ సార్ రెండు సిద్ధాంతాలను బలంగా పాటించేవారు. ఒకటి తెలంగాణ సాధన, రెండోది శనివారం పూర్తిస్థాయి ఉపవాసం ఉండేవారు. తొలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో అసలేం జరిగింది? ఆ తర్వాత మీరేం చేశారని అడిగితే.. ఎవరన్నా ఒకరు కేసీఆర్ లాంటోడు రాకపోతడా.. అని చెప్పి ఆశగా ఎదురు చూసేవాళ్లమని ఆయన చెప్పారు. ఐదారుగురు మీటింగ్ పెట్టినా వెళ్లేవాళ్లం. ఉపన్యాసం ఇచ్చేవాళ్లం. తెలంగాణ ఉద్యమ సోయి బతికి ఉండాలనే ప్రయత్నాలు ముమ్మరంగా చేసేవాళ్లమని జయశంకర్ సార్ చెప్పేవారు. ఆ సందర్భంలో కొన్ని వామపక్ష పార్టీలు కూడా రకరకాల పేర్లతో ఉద్యమానికి జీవం పోసే ప్రయత్నం చేశాయి. వాళ్ల పంథాలో వాళ్లూ తెలంగాణ మహాసభ, తెలంగాణ జనసభ.. ఇలా అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత మొదట ఒక నిర్ణయం తీసుకున్నాం. విద్యార్థులు ఎమోషనల్‌గా ఉంటారు.. వాళ్లను ఉద్యమంలోకి రానివ్వొద్దని నిర్ణయించాం. ఉద్యమానికి ఇబ్బందులు వస్తాయని భావించాం. ఉద్యోగులను బలిచేసుకోవద్దని అనుకున్నాం. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లాం.
అమరుల త్యాగం చిరస్థాయిగా నిలిచేలా
ఇది తెలంగాణ అమరజ్యోతి. ఎల్లకాలం మన గుండెల్లో నిలిచి ఉండేలా నిర్మించుకున్నాం. అందులో సుమారు ఐదారు వందల మంది కూర్చుని సభలు జరుపుకునేలా విశాలమైన హాలు ఉన్నది. సభ ఎక్కడ జరిగింది? అంటే తెలంగాణ అమరజ్యోతిలో అని చెప్పుకొనేలా ఉండాలి. అమరజ్యోతి పేరు ఎప్పటికీ మన నోళ్లలో నానాలనే ఉద్దేశంతో అంతపెద్ద హాల్ నిర్మించాం. 1969 ఉద్యమం నాటి ఫొటోలు సైతం సేకరించాం. త్వరలోనే మిగిలిన అన్నింటినీ సేకరించి మొత్తం అమరవీరుల ఫొటోలను ఒక ప్రత్యేక ప్రదేశంలో అలంకరిస్తాం. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం చిరస్థాయిగా నిలిచిపోవాలి. దీనికో ప్రత్యేకత ఉన్నది. 1969లో కొంత హింసాధోరణి ఉన్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ తెలంగాణవాది. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన మొట్టమొదటి త్యాగధనుడు. జలదృశ్యం పక్కనే ఆయన ఇల్లు ఉండేది. ఆ రోజు మేము వెళ్లిన వెంటనే తన ఇంట్లోనే ఆశ్రయమిస్తే అక్కడే ఆఫీసు ప్రారంభించాం. స్థానిక సంస్థల్లో వంద మండలాలకు పైచిలుకు విజయం సాధించాం. రెండు జిల్లా పరిషత్‌లు సొంతం చేసుకున్నాం. పోచంపాడులో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాం. అందరం అక్కడ ఉంటే.. ప్రభుత్వం కర్కశంగా ఆఫీసు అనే కనీస గౌరవం పాటించకుండా సామగ్రిని అంతా రోడ్డుమీద పడేసి ఆ భవనం మొత్తాన్ని ధ్వంసం చేశారు. అదేచోట అమరుల స్థూపం కట్టాలని, అప్పుడే అమరుల ఆత్మ శాంతిస్తుందని నిర్ణయించాం. అదే జలదృశ్యంలో అద్భుతంగా ప్రపంచంలోనే మరెక్కడా లేనంత గొప్పగా అమరజ్యోతిని నిర్మించాం.
మహాత్మాగాంధీ స్ఫూర్తితోనే ఆయన పద్ధతిలోనే మనం ముందుకు సాగాం. ఎంతో ఒపికతో దేవుడిచ్చిన శక్తినంతా కూడగట్టుకొని హింస చెలరేగకుండా చూశాం. సమైక్యవాదులు, తెలంగాణలోని సమైక్యవాదుల తొత్తులు.. నామీద జరిపినన్ని దాడులు ప్రపంచంలో మరే ఉద్యమ నాయకుడిపై జరిగి ఉండవు. అయినా నేను ఏనాడూ బాధ పడలేదు. నా ప్రజల కోసం నేను పాటుపడుతున్నాను కాబట్టి..ఆ తిట్లే దీవెనలు అనుకొని ముందుకు సాగాను. జయశంకర్ సార్, స్వామిగౌడ్, దేవీప్రసాద్ అందరం కలిసి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన కార్యక్రమం చేశాం. అక్కడి నుంచి ఇల్లెందు వస్తుంటే అప్పటి సీఎం రోశయ్య ఒక జీవో తీసుకొచ్చి హైదరాబాద్‌లో కూడా మనకు ఉద్యోగాలు దొరకని పరిస్థితి సృష్టించారు. దానికి తీవ్రంగా నిరసన తెలియజేశాం. ఉద్యోగ గర్జనలోనే నేను నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటించాను. ‘కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని చెప్పాను. దీక్షలో కూర్చుంటే నిమ్స్‌లో నన్ను చాలా బెదిరించారు. అసలే సన్నగున్నవ్, నీకు శక్తి లేదు, ఒకసారి కోమాలోకి వెళితే మళ్లీ రివర్స్ రాలేవు అని భయపెట్టారు. అవన్నీ లెక్కచేయలేదు.. వెనకడుగు వేయలేదు. విద్యార్థి, జేఏసీ మిత్రులంతా అద్భుతంగా నిరసనలు తెలియజేస్తుంటే.. నా దీక్షకు ఢిల్లీ సర్కారు దిగొచ్చింది. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది. దాని తర్వాత నేను దీక్ష విరమించాను. ఆ తర్వాత కుట్రలు, కుతంత్రాలు.. చివరి నిమిషం దాకా వలస వాదులు, సమైక్య వాదులు చెయ్యని ప్రయత్నం లేదు. చివరికి పార్లమెంట్‌లోనే పెప్పర్ స్ప్రేలు చల్లే స్థాయికి దిగజాడాన్ని దేశమంతా చూసింది. తెలంగాణ రాకుండా అడ్డుకోవాలని అంత దారుణంగా ప్రయత్నించారు. వాటన్నింటినీ అడ్డుకుంటూనే ఉద్యమాన్ని కొనసాగించాం.
పిల్లల మరణం ఆవేదన కలిగించింది
ఒక్క రక్తం చుక్క కారకుండా, ఎవరికీ నష్టం కలుగకుండా, ఒక్క దెబ్బ తగలకుండా తెలంగాణ సాధించుకోవాలని అనుకున్నాం. అయితే నా నిరాహార దీక్ష సందర్భంగా ఆ ఘట్టం విచిత్రమైన మలుపు తీసుకున్నది. మేం చస్తే అయినా కేంద్ర ప్రభుత్వం కండ్లు తెరుస్తదేమో, బుద్ధి వస్తదేమో అనే ఉద్దేశంతో అనేకమంది పిల్లలు, ఇతరులు ప్రాణాలను త్యాగం చేశారు. నన్ను వ్యక్తిగతంగా ఎన్ని రకాలుగా, ఎంత హింసించినా, ఏం చేసినా కూడా నేను బాధ పడలేదు. కానీ, ఈ అనూహ్య ఘట్టంలో బలిదానాలు జరగడం నన్ను బాగా కలిచివేసింది. ఆ ప్రాణాలకు మనం వెలకట్టేలేం. తెలంగాణ వచ్చిన తర్వాత దాదాపు ఆరేడువందల మంది అమరుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఉద్యోగాలు ఇచ్చినం. ఇంటికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేసినం. ఇల్లు లేనివాళ్లకు కట్టించినం. ఇలా ఉన్నంతలో సాయం చేసినం. ఇంకా ఎవరైనా ఉంటే ఉదారంగా సాయం చేసుకోవచ్చు. దానికి పెద్ద ఇబ్బంది లేదు.
యూనిక్‌గా ఉండాలనే..
అక్కడక్కడ కొంత మంది మూర్ఖులు ఉంటరు. వాళ్లకు తత్తరపాటు, తొందరపాటు ఎక్కువ. అమరుల స్థూపం ఏమైంది? అని అన్నారు. నేను మలేషియా, చైనా, సింగపూర్ వంటి దేశాలకు పోయినప్పుడు అక్కడ అమరుల స్మారకాలను చూసిన. అదే పద్ధతిలో తెలంగాణ అమరులకు మనం ఇచ్చే నివాళి చాలా యూనిక్‌గా ఉండాలని భావించినం. మిత్రులు రమణారెడ్డిని, ఈఎన్సీ గణపతిరెడ్డిని పిలిచి స్మారకం గురించి చర్చించాం. చాలా యూనిక్‌గా ఉండాలని చెప్పిన. జ్యోతి పట్టినట్టు ఉండాలన్న నా భావనకు తగ్గట్టు డిజైన్ చేస్తామని వారు చెప్పారు. దీపకలికలాగా, ఒక దీపం వెలుగుతున్నట్టుగా బ్రహ్మాండంగా అమరులను ప్రతిక్షణం కండ్లలో చూసుకునే విధంగా డిజైన్ చేసి చూపెట్టారు. అదే రీతిలో అద్భుతమైన అమరజ్యోతికి రూపకల్పన చేశారు. అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా, అమరుల జ్యోతి రూపంలో మన సొంత బిడ్డలు మన కండ్లలో ప్రకాశిస్తూ ఉండాలి. ఈ సచివాలయంలో పరిపాలన చేసే సీఎంలు, సీఎస్‌లు, మంత్రులు అందరికీ.. ఎంత మంది త్యాగాలతో ఈ తెలంగాణ వచ్చిందో, మనం ఎంత జాగ్రత్తతో దీనిని ముందుకు తీసుకుపోవాలో తెలియజెప్పేలా అమర జ్యోతి ఏర్పాటయ్యింది.

ల్యాండ్ మార్క్‌గా సచివాలయ ప్రాంగణం
ఒకవైపు రాష్ట్ర పరిపాలన గుండెకాయ అయిన సచివాలయం, పక్కనే అమరుల స్మారకం, కులమత వర్గాలను నిర్మూలించాలని వాదించిన అంబేద్కర్ గొప్ప విగ్రహం, మరోవైపు ప్రపంచమంతా శాంతి, కరుణ, ప్రేమతో బతకాలని ప్రవచించిన బుద్ధుని విగ్రహం.. ఇలా హైదరాబాద్‌లో ఈ ప్రాంగణం ఒక ల్యాండ్ మార్క్‌గా తయారైంది. సచివాలయానికి, అమరుల స్మారకానికి మధ్య ఉన్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం వస్తుంది. అమరుల స్ఫూర్తి, ఉద్యమ సాధనలో పడ్డ శ్రమ.. దాని కసి తీర్చుకొంటూ ఈ రోజు కులం, మతం, జాతి, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఎవరికి అవసరమో, వారికి సాయం అందిస్తూ ప్రభుత్వం పురోగమిస్తున్నది. కచ్చితంగా నిరంతరం ఇదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతుందని, రాష్ర్టాన్ని ఇదేవిధంగా ముందుకు తీసుకుపోతుందని అందరికీ హామీ ఇస్తున్నాను అని సీఎం కేసీఆర్ తెలిపారు.
అంచనాలను తలకిందులు చేశాం
సాధించుకున్న తెంలగాణలో అద్భుతంగా పురోగమిస్తున్నాం. రాష్ట్రం ఇంత తొందరగా ఇంత ప్రగతి సాధిస్తుందని ఎవరూ, ఏనాడూ ఊహించలేదు. తెలంగాణ సాధన కోసం తిరుగుతున్నప్పుడు శ్రీ కృష్ణ కమిటీయో, మరో కమిటీయో, ఢిల్లీలో ఎవడుపడితే వాడు అడిగే లక్షలాది యక్ష ప్రశ్నలకు మేం సమాధానం ఇచ్చినం. ‘మీ రాష్ట్రం ఎట్లా బతుకుతది? ఆదాయం ఎట్లా?’ అని అడిగేవారు. ఈ రోజు అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అనేక రంగాల్లో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచాం. తలసరి ఆదాయంలో, విద్యుత్తు సరఫరాలో, తలసరి విద్యుత్తు వినియోగంలో, తాగునీటి సరఫరాలో, పంజాబ్‌నే తలదన్నేలా ధాన్యం ఉత్పత్తిలో.. ఇలా అనేక రంగాల్లో ముందుకు పోయినం. మనం కుదుటపడ్డ తర్వాత, ఆర్థిక సౌష్టవం ఏర్పడ్డ తర్వాత.. అణగారిపోయిన దళితజాతికి కచ్చితంగా ఒక మార్గం చూపెట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ దేశానికే మనం తొవ్వ చూపియ్యాలె అనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా దళితబంధు కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత దేశంలోని చాలా మంది దళిత మేధావులు నన్ను అడిగితే.. ‘దేశం మొఖం మీద ఇదొక మచ్చ ఉన్నది. వాళ్లను ఎన్ని దశాబ్దాలు అలాగే ఉంచుతాం. మనకు సిగ్గుండాలి. అమెరికా ప్రజలు నల్లజాతీయులను అవమానించారు. బరాక్ ఒబామాను అమెరికా అధ్యక్షుడిగా చేయడం ద్వారా వాళ్ల పాపాలను కడిగేసుకున్నారు. మనం కూడా రియలైజ్ కావాలి. అటువంటి పరిణతి రావాల్సి ఉన్నది’ అని వారికి చెప్పాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవచించిన సమతా సిద్ధాంతాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రపంచంలోనే సమున్నతమైన 125 అడుగుల ఎత్తున్న బాబా సాహెబ్ విగ్రహాన్ని ఇటీవలే ఆవిష్కరించాం. దానిని అందరూ ప్రశంసిస్తున్నారు.
సమైక్యవాదులు, తెలంగాణలోని సమైక్యవాదుల తొత్తులు.. నామీద జరిపినన్ని దాడులు ప్రపంచంలో మరే ఉద్యమ నాయకుడిపై జరిగి ఉండవు. అయినా నేను ఏనాడూ బాధ పడలేదు. నా ప్రజల కోసం నేను పాటుపడుతున్నాను కాబట్టి..ఆ తిట్లే దీవెనలు అనుకొని ముందుకు సాగాను.
– సీఎం కేసీఆర్
అమరులకు నివాళి అర్పించిన తర్వాతే..
ఇకపై రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆచారం పెట్టుకుంటాం. ఇక్కడికి ఇతర రాష్ర్టాలవాళ్లు వచ్చినా, విదేశీ ప్రతినిధులు వచ్చినా ముందుగా అమరుల ఘాట్ (అమర జ్యోతి) దగ్గర నివాళులు అర్పించిన తర్వాతే మిగతా కార్యక్రమాలు జరిగేలా కార్యచరణ రూపకల్పన చేస్తాం. తెలంగాణ ప్రస్థానంపై డాక్యుమెంటరీని అద్భుతంగా రూపొందించారు. దీంతోపాటు తెలంగాణ చరిత్రను కండ్లకు కట్టినట్టు చూపించేలా, ఉద్యమ ప్రస్థానాన్ని సమగ్రంగా వివరించేలా, గొప్పగా ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతిఒక్కరికి నా మనవి. 1969 నాటి ఉద్యమం కావొచ్చు, ఇప్పటిది కావొచ్చు.. మీ ప్రాంతంలో జరిగిన త్యాగాలు గానీ, మంచిగానీ, చెడ్డగానీ, తెలంగాణ ఉద్యమ ఘట్టాలు ఉంటే ప్రభుత్వానికి పంపండి. తప్పకుండా వాటిని ఈ ఫొటో గ్యాలరీలో పొందుపరుస్తాం.
రాజీనామాలనూ అస్ర్తాలుగా వాడుకున్నాం
చాలామంది మొదట్లో నాతో విభేదించారు. ఉద్యమం అంటే లొల్లిలొల్లి చేయాలి. బస్సులు తగలపెట్టాలి. బంద్‌లకు పిలుపునివ్వాలనే పద్ధతిలో చెప్పారు. అది సాధ్యమయ్యేది కాదని చెప్పాను. అలా చాలామందిని ఒప్పించి ముందుకు సాగాం. ఒక ప్రణాళికతో, ఓర్పుతో చాకచక్యంగా మందుకెళ్లడంతో తెలంగాణ కల సాకారమైంది. ఎన్నిసార్లు రాజీనామా చేశామో లెక్కేలేదు. కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే, ఎంపీ.. అన్నీ లెక్కచేయకుండా త్యాగం చేశాం. పదవంటే లెక్కలేదా? అట్ల ఇసిరి పారేసినట్టు రాజీనామాలు చేస్తారేంటి? అని చాలామంది నన్ను అడిగేవాళ్లు. తెలంగాణ ప్రజలంటే మాకంత నమ్మకం.. వాళ్లే మమ్మల్ని కాపాడుకుంటారని చెప్పేవాడిని. రాజీనామాలను కూడా ఒక అస్ర్తాలుగా వాడి కొత్త వ్యూహంతో ముందుకెళ్లాం.
– సీఎం కేసీఆర్